హైదరాబాద్, ఏప్రిల్30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగునీటి రంగ నిపుణుడు శ్రీధర్‌రావు దేశ్‌పాండే రచించిన “కాళేశ్వరం ప్రాజెక్టు: ప్రశ్నలు-విమర్శలు-వక్రీకరణలు-వివరణలు, సాగునీటి రంగంలో తెలంగాణ పదేండ్ల ప్రస్థానం” పుస్తకావిష్కరణ కార్యక్రమం తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం 5 గంటలకు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని పేరొన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరగనున్న సభకు ముఖ్యఅతిథిగా మాజీమంత్రి హరీశ్‌రావు, గౌరవ అతిథిగా మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి, విశిష్ట అతిథులుగా జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్, అంబేదర్ వర్సిటీ మాజీ వీసీ సీతారామారావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాదరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రిటైర్డు ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశం, సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాలస్వామి పాల్గొంటారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాల్సిన తప్పనిసరి అవసరం, సందర్భం ఉన్నందునే తెలంగాణ వికాస సమితి బాధ్యతగా తీసుకుని ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నదని ఎర్రోజు శ్రీనివాస్ వెల్లడించారు.