హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర సంస్థలు హైకోర్టుకు నివేదించాయి. ప్రాజెక్టు నిర్వహణ అంటే మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు మరమ్మతులు, ప్రాజెక్టును వినియోగంలోకి తేవడం, జలాశయంలో నీటిని నిల్వచేయడం, అవసరమైనప్పుడు దిగువకు విడుదల చేయడం, ఇతర జలాశయాలకు తరలించడం వంటి నిర్వహణ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం, ప్రాజెక్టు అథారిటీ పరిధిలోనివేనని కేంద్ర జలసంఘం జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లలో స్పష్టంచేశాయి.
న్యాయవాది ఎస్ శరత్‌కుమార్ వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసాయిరెడ్డి గతంలో విచారించి ప్రతివాదులైన సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏకి నోటీసులు జారీ చేశారు. ఆ రెండు సంస్థలు వేర్వేరుగా దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లలో ఈ కింది అంశాలు ఉన్నాయి. రైతుల సాగునీటి అవసరాలు, ప్రాజెక్టు నీటిని ఏ విధంగా వినియోగించాలి, బరాజ్‌లను ఎలా ఆపరేట్ చేయాలన్నవి రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన అంశాలున్నాయి. నీటిని నిల్వ చేయాలా? విడుదల చేయాలా? ఇతర జలాశయాలకు పంపింగ్ చేయాలా? అన్న నిర్ణయాల్లో కేంద్ర సంస్థలు జోక్యం చేసుకోవని పేర్కొన్నాయి. బరాజ్‌ల భద్రత, సాంకేతిక సమస్యల పరిశీలన, సాంకేతిక సలహాలు, సూచనలు, పునరుద్ధరణ పనులపై పర్యవేక్షణ మాత్రమే తమ పరిధిలో ఉంటుందని తెలిపాయి.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో సమస్యలు తలెత్తిన తర్వాత రాష్ట్రానికి సాంకేతిక పరిశీలనలు, సూచనలు చేసినట్టు కేంద్ర సంస్థలు తెలిపాయి. మేడిగడ్డలో 2023 అక్టోబర్‌లో ఎన్డీఎస్ఏ ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటుచేసి పరిశీలన జరిపినట్టు పేర్కొన్నాయి. నవంబర్1న నివేదిక సమర్పించగా, మేడిగడ్డలో సమస్యలకు ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణ నాణ్యత, ఆపరేషన్, నిర్వహణలోని లోపాల సమ్మేళనం కారణమని కమిటీ గుర్తించిందని తెలిపాయి. మూడు బరాజ్‌లపై సమగ్ర సాంకేతిక పరిశీలన కోసం 2024 మార్చి 2న సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ జే చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నాయి. ఈ కమిటీ పరిశోధనలు, జల, నిర్మాణ అంశాలు, నిర్మాణ నాణ్యత, నిర్వహణ, పునరుద్ధరణ తదితర అంశాలను పరిశీలించి నిరుడు మార్చిలో తుది నివేదిక సమర్పించినట్టు పేర్కొన్నాయి.
మేడిగడ్డలో నీటి ఒత్తిడిని తగ్గించేందుకు 2024 మే 1న భద్రతాపరమైన మధ్యంతర సూచనలు జారీచేశామని, బ్లాక్ -7 గేట్లను, అవసరమైన చోట పిల్లర్ నంబర్ 20కి ఆనుకుని ఉన్న దెబ్బతిన్న గేట్లను వానకాలానికి ముందు పూర్తిగా తెరిచి ఉంచాలన్నది ముఖ్యమైన సూచన అని తెలిపాయి. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు కూడా ముందస్తు భద్రతా చర్యలకు సూచనలు చేసినట్టు పేర్కొన్నాయి. 2026 మార్చి 27న మూడు బరాజ్‌లపై సమీక్ష నిర్వహించాక, జూన్ 30న కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణకు సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపాయి. ఈ కమిటీ పునరుద్ధరణ రూపకల్పనపై సాంకేతిక సలహాలు ఇవ్వడం, అవసరమైనప్పుడు ప్రాజెక్టును సందర్శించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నాయి. ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల అమలు, నిర్మాణం, అవసరమైన పరిశోధనలు, నాణ్యత హామీ, నాణ్యత నియంత్రణ ప్రాజెక్టు అథారిటీదేనని తేల్చి చెప్పాయి. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ గతంలోనే స్పష్టం చేసిందని పేర్కొన్నాయి.
డ్యామ్ భద్రతా చట్టం-2021 ప్రకారం భద్రత, పునరుద్ధరణ చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన అవసరమైన ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర డ్యామ్భద్రత సంస్థదేనని, రైతుల వ్యవసాయ ఇబ్బందులు, సాగునీటి అవసరాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విధానపరమైన అంశాలని పేర్కొన్నాయి వీటిపై కేంద్ర సంస్థలకు జోక్యం చేసుకునే అధికారం లేదని, ఉండదని స్పష్టంచేశాయి. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని, కేంద్ర సంస్థలు చెప్పబోవని పేర్కొన్నాయి. గతంలో బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించి తలెత్తిన సాంకేతిక అంశాలపై నిపుణుల కమిటీల పరిశీలనలు, సిఫార్సులు చేసినప్పటికీ ప్రస్తుతం వాటి పునరుద్ధరణ, నిర్వహణ, నీటి వినియోగానికి సంబంధించిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం, ప్రాజెక్టు అథారిటీ మాత్రమే చేపట్టాలని తేల్చి చెప్పాయి. ఆ బాధ్యతలను కేంద్ర సంస్థలు చేపట్టబోవని, అందుకే ఆ పిటిషన్‌ను కొట్టేయండి.. అని సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ వేర్వేరుగా దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లలో హైకోర్టును కోరాయి.