శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 02:50:19

‘అన్నపూర్ణ’లో మరో మోటర్‌

‘అన్నపూర్ణ’లో మరో మోటర్‌
  • యూనిట్‌-4 ట్రయల్న్‌ విజయవంతం
  • నేడు మరో మోటర్‌ పరీక్షకు కసరత్తు
  • రిజర్వాయర్‌లో 0.3 టీఎంసీల నీరు నిల్వ

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టులోని నాలుగో లింకులో నీటివిడుదల కొనసాగుతున్నది. రాజ న్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ పంప్‌హౌజ్‌లో ఈనెల 11న మొదటి మోటర్‌ ట్రయల్న్‌ విజయవంతం చేసిన అధికారులు.. తాజాగా మరో మోటర్‌ను దిగ్విజయంగా ప్రారంభించారు. శనివారం ఉదయం 6.20 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాం, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ఇతర ఇంజినీర్లు అన్నపూర్ణ పంప్‌హౌజ్‌లో మరో మోటరు (యూనిట్‌-4)కు ట్రయల్న్‌ నిర్వహించారు. శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌ నుంచి అన్నపూర్ణ జలాశయానికి కాళేశ్వర జలాల్ని తరలించేందుకు అన్నపూర్ణ పంప్‌హౌజ్‌లో నాలుగు మోటర్లను అమర్చారు. 


106 మెగావాట్ల సామర్థ్యమున్న ఒక్కో మోటరు ద్వారా 2,836 క్యూసెక్కుల చొప్పున మొత్తం 11,347 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయవచ్చు. శనివారం పంప్‌హౌజ్‌లోని యూనిట్‌-4లోని మోటర్‌ ట్రయల్న్‌ నిర్వహించారు. ఇది కూడా విజయవంతం కావడంతో ఆదివారం సాయంత్రం మరో మోటర్‌ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 3.5 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం ఉన్న అన్నపూర్ణ జలాశయంలో శనివారం సాయంత్రం వరకు 0.3 టీఎంసీల నీరు చేరుకున్నదని ఈఎన్సీ హరిరాం తెలిపారు. నీటి నిల్వ 0.8 టీఎంసీలకు చేరితే.. అన్నపూర్ణ జలాశయం నుంచి రంగనాయకసాగర్‌కు జలాలను ఎత్తిపోసేందుకు సాంకేతికంగా వీలవుతుందని అధికారులు తెలిపారు. 


లక్ష్మి బరాజ్‌లో 3.571 టీఎంసీలు 

మహదేవపూర్‌: జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని లక్ష్మి బరాజ్‌లో శనివారం 3.571 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కొన్ని నెలలుగా ఎగువ నుంచి వస్తున్న ప్రాణహిత నదీ జలాలు లక్ష్మి బరాజ్‌లో చేరుతున్నాయి. లక్ష్మి పంప్‌హౌజ్‌ నుంచి సరస్వతి బరాజ్‌కు నీటిని తరలిస్తున్నారు. 


logo