నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 2: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ పరిధిలోని 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలోని పలు సెంటర్లలో పార్టీ నాయకులు ధర్నా, రాస్తారోకో చేశారు. ఏబీవీపీ కేయూ శాఖ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని అన్ని విభాగాల తరగతులను బహిషరించారు. శాయంపేట బస్టాండ్ సెంటర్లో బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ యూనివర్సిటీ బంద్ నిర్వహించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి యూనివర్సిటీ మెయిన్ గేట్ వరకు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సీపీఎం, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీలు చేపట్టడంతోపాటు పలుచోట్ల సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పాల్వంచ, టేకులపల్లి, ఎర్రుపాలెం, కారేపల్లి, తిరుమలాయపాలెం, కొణిజర్ల, ఖమ్మం నగరం, ఇల్లెందు, జూలూరుపాడు మండల కేంద్రాల్లో నిరసనలు, దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేపట్టారు.
కరీంనగ్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి పోలీసుల వేషధారణ వేసుకొని సీపీఎం, ఎప్ఎస్ఐ కార్యకర్తలకు సంకెళ్లు వేసి లాక్కెళ్లుతున్నట్టు వినూత్నంగా నిరసన తెలిపారు. నగరంలోని సదాశివపల్లిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సుంకరి సంపత్, మండల కార్యకర్తలతో కలిసి విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. హుజూరాబాద్ పట్టణంలో సీపీఎం మండల కార్యదర్శి కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీలో తరగతులు బహిష్కరించారు.
హైదరాబాద్‌లో ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. సేవ్ హెచ్‌సీయూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కొనసాగింది. బుధవారం నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు నిరసన తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. కూకట్పల్లి జేఎన్టీయూ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ ప్రొఫెసర్లు గళమెత్తారు. బీజేవైఎం, పలు విద్యార్థి సంఘాలతో హెచ్‌సీయూ అట్టుడికింది. ఎస్ఎఫ్ఐ, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు గురువారం చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చాయి.
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు బుధవారం హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని మంత్రి ఇంటి గేటు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలో ఎకించి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు బీ నరసింహారావు, మొగిలి వెంకట్‌రెడ్డి, మర్రి మహేశ్, భాషబోయిన సంతోశ్, కే శ్రావణ్, మాలోత్ రాజేశ్, మంద నరేశ్, ఎల్తూరి సాయికుమార్, కుమ్మరి శ్రీనాథ్, శివ నాస్తిక్ పాల్గొన్నారు.