Telangana Emblem | వరంగల్, ఆగస్టు 26 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : రాజముద్రను అధికారులు ఇష్టారీతిగా వినియోగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తక్కువ చేసేలా రాజముద్రలో మార్పులు చేసే ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం అత్యుత్సాహం చూపి రాజముద్రను మార్చారు. ఎల్ఆర్ఎస్పై సందేహాల నివృత్తి కోసం ప్రభుత్వం అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సోమవారం హెల్ప్ డెస్క్ బ్యానర్ ఏర్పాటు చేశారు.
ఇందులో తెలంగాణ రాజముద్ర మార్చేశారు. అధికారిక రాజముద్ర కాకుండా కొత్తగా చేసి పెట్టారు. అధికారులు రాజముద్రను మార్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ చారిత్రక గొప్పదనాన్ని తెలిపేలా రాజముద్రలో కాకతీయ కళాతోరణాన్ని పెడితే, మున్సిపల్ కార్పొరేషన్ విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు. వరంగల్ నగర ఔన్నత్యాన్ని తగ్గించేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.