హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజును (ఫిబ్రవరి 17) పురస్కరించుకొని రాజహేంద్రవరంలోని కడియం నర్సరీ రైతులు వెయ్యి మొకలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ పిలుపు మేరకు వృక్షార్చనలో భాగంగా బుధవారం నిర్వహించిన ఈ వేడుకకు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులతో కలిసి ఉత్సాహంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు బంధువు, హరిత ప్రేమికుడు కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని కడియం నర్సరీ రైతు పాలూరి నాని ఆధ్వర్యంలో 1000 మొకలు నాటడం గొప్ప విషయమని ప్రశంసించారు. కేసీఆర్‌పై రైతులు చూపించిన ప్రేమ అభినందనీయమని పేర్కొన్నారు. ప్రాంతాలుగా విడిపోయినా, ప్రజలుగా కలిసిమెలిసి ఉందామని ఉద్యమ సమయం నుంచే కేసీఆర్ చెప్పేవారని, ఇకడి వాతావరణం చూస్తుంటే కేసీఆర్ నాడు చెప్పిన మాటలు గుర్తుకువస్తున్నాయని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో హరితహారం ద్వారా పదేండ్లలో 280 కోట్ల మొకలను నాటామని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8.3 శాతం పచ్చదనం పెరిగిందని గుర్తుచేశారు. కడియం రైతు మాధవ్ మాట్లాడుతూ.. రైతుబంధువు కేసీఆర్ పుట్టినరోజును పురసరించుకొని మొకలు నాటడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. హరితహారం వల్ల తమకు ఉపాధి లభించిందని, కడియం నర్సరీల నుంచి తెలంగాణ ప్రభుత్వం మొకలను కొనుగోలు చేయడంతో తమ వ్యాపారం ఎంతో వృద్ధి చెందిందని గుర్తుచేశారు. అనంతరం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు జీవించాలని, మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రైతులు బాలాజీ, ఈల సత్యనారాయణ, శ్రీనివాసరావు, నిమ్మలపూడి త్రిమూర్తులు, హరిత సేవ నాయకులు రాఘవ, కిశోర్‌గౌడ్, పూర్ణచందర్, పాండాల జగన్మోహన్, మురళీకృష్ణ, సతీశ్, ఎన్ఎన్ రాజు, భోజనారాయణ తదితరులు పాల్గొన్నారు.