Hyderabad | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): చిన్నప్పటి నుంచే ఉన్నత చదువులు చదవాలనేది ఆయన లక్ష్యం. కానీ, లక్ష్యానికి కుటుంబ పరిస్థితులు అడ్డుపడ్డాయి. ఇప్పుడు కుటుంబ బాధ్యతలు అన్నీ నెరవేర్చి ఇప్పుడు74 ఏండ్ల వయస్సులో డిగ్రీలో ప్రవేశం పొందారు. ఆయనే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన కే చిన్నా ఎరుకులు. డిగ్రీలో చేరడానికి ఆయన చిన్నపాటి పోరాటమే చేయాల్సి వచ్చింది. ఏపీ ట్రాన్స్‌కోలో లైన్‌మన్‌గా పనిచేసి 2007లో కే చిన్నా ఎరుకులు పదవీ విరమణ పొందారు. అనంతరం బీటెక్ చదవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. తొలుత ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి పూర్తిచేశారు. 2021లో ఇంటర్ వొకేషనల్ కోర్సులో చేరి ఇంటర్మీడియట్‌ను పూర్తిచేశారు.
ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా సెకండియర్‌లో ల్యాటరల్ ఎంట్రీ ద్వారా చేరినా కొన్ని పేపర్లు బ్యాక్‌లాగ్‌లో ఉండటంతో డిప్లొమా పొందలేకపోయారు. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరాలనుకున్నా అధిక ఫీజులు భరించలేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆయనకు వయస్సు అడ్డంకిగా మారింది. కే చిన్నా 1948లో జన్మించగా, దోస్త్ వెబ్సైట్లో 1973లోపు జన్మించిన వారికే అడ్మిషన్లు కల్పిస్తున్నారు. దీనిని సవరించాలని కోరుతూ ఆయన ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ అధికారులను సంప్రదించారు. ఆధార్‌కార్డులో సాంకేతిక కారణాలు సైతం అడ్డంకిగా నిలిచాయి. ఆయన ఆశయం, పోరాటం ముందు అన్ని తలవంచాయి. ఎట్టకేలకు నాలుగేండ్ల బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ (ఆనర్స్) కోర్సులో ప్రవేశం పొందిన కే చిన్నా ఎరుకల.. చలో అంటూ కాలేజీకి వెళ్తున్నారు. నిరుడు 75 ఏండ్ల మాజీ సైనికుడు నాగ్‌శెట్టి బీఏ (హెచ్ఈపీ)లో చేరారు.