హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ‘మా అమ్మే నా జీవిత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. నేను ఉన్నత స్థితికి చేరేందుకు నిజజీవిత తెరపై ఆమే వీరోచిత కథానాయిక పాత్ర పోషించారు. నాకు ఊహ తెలియని 15 నెలల వయసులో నా తండ్రి చనిపోతే అమ్మే అన్నీ తానై పెంచారు. అంతేకాకుండా రాష్ట్రపతి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును సైతం అందుకున్నారు. అలాంటి అమ్మ గురించి ఎంత చెప్పినా తకువే. ఆమె తర్వాతే జగమంతా అంటే పూర్తి న్యాయం చేసినట్టు అవుతుంది’ అని హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ తన తల్లి గురించి ఎంతో గర్వంగా చెప్పారు. శుక్రవారం హైకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. జిల్లా కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య పెరుగుతుండటం స్వాగతనీయమని పేర్కొన్నారు. గౌరవ అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రసంగిస్తూ.. మహిళలకు రిజర్వేషన్ల కల్పన హర్షణీయమని కొనియాడారు. మహిళా సాధికారత వల్ల సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పరిఢవిల్లుతుందని జస్టిస్ సూరేపల్లి నంద తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ రవీందర్రెడ్డి, ఉపాధ్యక్షురాలు దీప్తి, కార్యదర్శులు శాంతిభూషణ్రావు, జీ సంజీవరెడ్డి, సంయుక్త కార్యదర్శి వీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.