Justice L Narsimha Reddy | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): శనివారం ఉదయం 10:45 గంటలు. కేసీఆర్ ప్రతినిధి ఒకరు ఆయన రాసిన లేఖను తీసుకొని హైదరాబాద్‌లోని బీఆర్కేభవన్లో ఉన్న విచారణ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. అక్కడున్న సిబ్బందికి లేఖను అందజేసి వెళ్లిపోయారు. సరిగ్గా ఉదయం 11:00 గంటల సమయంలో జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు. మీడియా ప్రతినిధులు వీడియోలు, ఫొటోలు తీయడం మొదలెట్టారు. కేసీఆర్ రాసిన లేఖ అందిన విషయాన్ని ఆఫీసు సిబ్బంది జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డికి వివరించారు. ఆయన కేసీఆర్ రాసిన లేఖను అందుకున్నారు.
మధ్యాహ్నం 1:36 గంటల ప్రాంతంలో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తారంటూ అనధికారిక వర్తమానం అందింది. ఒకరి వెంట ఒకరు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, వీ6, వెలుగు, హెచ్ఎంటీవీ, నమస్తే తెలంగాణ ప్రతినిధులంతా ఆఫీసుకు చేరుకున్నారు. మీడియా ప్రతినిధుల రాక సమాచారాన్ని ఆఫీసు సిబ్బంది ద్వారా తెలుసుకున్న నర్సింహారెడ్డి స్పందించాలా.. వద్దా.. అంటూ కాసేపు తర్జనభర్జన పడ్డారు. ఆఖరుకు జస్టిస్ మాట్లాడరంటూ ఆఫీసు సిబ్బంది వర్తమానం అందించగా, మీడియా ప్రతినిధులు వెనుదిరగాల్సి వచ్చింది. ఆఖరుకు మధ్యాహ్నం 2:20 గంటల తర్వాత కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.
కేసీఆర్‌పై కుట్రలు చేస్తే ఉద్యమిస్తాం: బీఆర్ఎస్వీ
కేసీఆర్‌పై కుట్రలు చేస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస్వీ హెచ్చరించింది. కేసీఆర్‌పై చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్వీ నాయకులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ కమిషన్ సాకుతో కేసీఆర్ ప్రతిష్టను తగ్గించేలా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కుట్రపూరిత విధానాలు అవలంబిస్తున్నదని ఆరోపించారు.