హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు, ఎంసీపీఐ(యూ) వ్యవస్థాపక నాయకుడు మద్దికాయల ఓంకార్ నేటి రాజకీయాల్లో అందరికీ ఆదర్శమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓంకార్ కీలక పాత్ర పోషించారని, ప్రజాసమస్యలపై శాసనసభలో గళమెత్తారని, పోరాటాలు నిర్మించారని చెప్పారు. హైదరాబాద్‌లోని ఓంకార్ భవన్లో ఓంకార్ శతజయంతి ఉత్సవాల లోగోను జస్టిస్ చంద్రకుమార్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలను సేవగా భావించి, ప్రజల కోసం అహోరాత్రులు పోరాడిననేత ఓంకార్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె మల్లేశ్, తుడుం అనిల్‌కుమార్, పల్లె మురళి, ఏ కిష్టయ్య, కర్ర దానయ్య పాల్గొన్నారు. శతజయంతి ఉత్సవాల ప్రారంభసభ మే 12న వరంగల్ జిల్లా మచ్చాపూర్‌లో జరుగుతుందని తెలిపారు. ఈ సభకు కవులు, కళాకారులు, వామపక్ష పార్టీల నేతలు హాజరవుతారని వనం సుధాకర్ చెప్పారు.