ఖైరతాబాద్, మే 19: రాష్ట్రవ్యాప్తంగా అకాలవర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మీడియా సమావేశంలో తెలంగాణ విఠల్, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృధ్వీరాజ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు అనేక పంటలు నీట మునిగాయని, చేతికొచ్చిన పంట తడిసిందని తెలిపారు. సరిపోను గోదాములు లేక రైతులు తమ పంట దిగుబడులను రోడ్లపై, పొలాల్లో, కల్లాల్లో రోజులు తరబడి పెట్టుకొని ధాన్యం విక్రయానికి ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇదే అదునుగా దళారులు తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని మార్కెట్ యార్డులో అమ్మకానికి పెట్టిన ధాన్యం సైతం కొనుగోలు చేయకుండా రైతులను వేధిస్తున్నారని, ఫలితంగా బాధిత రైతులు ఆందోళనలకు దిగుతున్నారని తెలిపారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని విమర్శించారు. పంటనష్టపోయిన రైతాంగానికి కనీస పరిహారం అందే అవకాశం లేకుండా చేశారని, ప్రతి ఎకరాను పంటల బీమా కిందికి తేవాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికే కనీస మద్దతు ధరను ప్రకటించకుండా తాత్సారం చేసిందని విమర్శించారు.