Justice Alok Aradhe | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ కుమార్ అరాధే నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఈ నెల 5న సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుగా బదిలీ చేస్తూ కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాష్ట్రపతి కొలీజియం సిఫారసులకు ఆమోదముద్ర వేయడంతో న్యాయశాఖ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ అలోక్ అరాధే స్వరాష్ట్రం మధ్యప్రదేశ్. ఆయన 1964 ఏప్రిల్ 13న రాయపుర్లో జన్మించారు. 1988 జులై 12న అడ్వొకేట్‌గా తన పేరును నమోదుచేసుకున్నారు. 2007లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. 2011 ఫిబ్రవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందగా.. 2016 సెప్టెంబరు 16న జమ్మూకశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2018 మే 11 నుంచి ఆగస్టు 10 వరకు అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2018 నవంబరు 17న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2022 జులై 3 నుంచి అక్టోబరు 15వరకు కర్ణాటక హైకోర్టు తాత్కాలిక సీజేగా పని చేశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధనేను నియమించింది.
తెలంగాణ హైకోర్టు జడ్జిగా జస్టిస్ సామ్ కోషిని బదిలీ చేస్తూ కేంద్రం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో పని చేస్తున్నారు. ఆయన అక్కడి నుంచి బదిలీ చేయాలని స్వయంగా సుప్రీంకోర్టు కొలీజియానికి విజ్ఞప్తి చేశారు. అయితే, మొదట ఆయనను మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించగా.. ఆయన మధ్యప్రదేశ్ మినహా మరో కోర్టుకైనా బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు ఆయనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.
తెలంగాణతో పాటు గుజరాత్, కేరళ, ఒడిశా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు నియామకయ్యారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, గుజరాత్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆశిశ్ జే దేశాయ్ కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎస్ మురళీధర్ 2023 ఆగస్టు 7న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాసిస్ తలపాత్ర ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలుపగా.. కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 5న ఆయా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా న్యాయమూర్తుల పేర్లను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే.