తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు.. ట్రిమ్ చేస్తే ‘ట్రిబ్’! ఇటీవల చేపట్టిన నియామకాల్లో అక్రమాల పుట్ట పగిలింది. రోజుకో క్యాటగిరీలో అవకతవకలు బయటపడుతున్నాయి.
ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను ట్రిబ్ అనర్హులకు కట్టబెట్టిందంటూ వివాదం మొదలవగా.. తాజాగా లైబ్రేరియన్, జేఎల్-బోటనీ పోస్టుల్లోనూ నోటిఫికేషన్‌కు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు మొదలయ్యాయి. దక్కాల్సిన పోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ ఉద్యోగార్థులు ఆందోళనకు గురవుతున్నారు. లోపభూయిష్టంగా ఉన్న ఎంపిక ప్రక్రియపై, నోటిఫికేషన్‌కు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై నిరుద్యోగులు ఒక్కొక్కరుగా న్యాయస్థానం మెట్లెక్కుతున్నారు.
TREI-RB | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఇటీవల చేపట్టిన నియామకాల్లో జరిగిన అవకతవకలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయి. పోస్టుల వారీగా బాధితులు వరుసగా కోర్టుమెట్లు ఎక్కుతున్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ధికోసం హడావుడిగా నియామకపత్రాలు అందించిన సర్కారు అక్రమాలు బయటపడుతున్నా నోరుమెదపడం లేదు. ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల్లో అనర్హులు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించగా, తాజాగా లైబ్రేరియన్ పోస్టులను కూడా అనర్హులకు కట్టబెట్టారని తెలుస్తున్నది. జేఎల్ పోస్టులను సైతం నోటిఫికేషన్‌కు విరుద్ధంగా భర్తీచేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 160 బోటనీ జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన ట్రిబ్ బోటనీతోపాటు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, మెరైన్ బయాలజీ, బయోసైన్స్, మాడ్రన్ బయాలజీ, ప్లాంట్ సైన్స్‌లో ఎమ్మెస్సీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులేనని పేర్కొన్నది. ఆ మేరకు జేఎల్ పోస్టులకు 1ః2 మెరిట్ జాబితాను విడుదల చేసింది.
డెమోలకు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. జేఎల్ బోటనీ పోస్టుకు సంబంధించి ఎంఎస్సీతోపాటు డిగ్రీలో కూడా బోటనీ చదివి ఉండాలని చెబుతూ పలువురు అభ్యర్థులను డెమోకు కూడా అనుమతించలేదు. నోటిఫికేషన్‌కు విరుద్ధంగా ఆంధ్రా యూనివర్సిటీ నుంచి మైక్రోబయాలజీ చేసినవారే జేఎల్ బోటనీకి అర్హులంటూ మరికొందరిని తిరస్కరించి తుది జాబితాను ప్రకటించింది. ట్రిబ్ తీరుపై బాధిత అభ్యర్థి కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు నోటిఫికేషన్ ప్రకారం జేఎల్ బోటనీ పోస్టుకు సంబంధించి యూనివర్సిటీతో సంబంధం లేకుండా మైక్రో బయోలజీ అభ్యర్థులు జేఎల్ బోటనీ పోస్టుకు అర్హులని స్పష్టం చేసింది. సదరు అభ్యర్థిని జేఎల్ బోటనీ పోస్టుకు ఎంపికచేయాలని ట్రిబ్ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ తీర్పు అనంతరం ఇదే తరహా అభ్యర్థనతో మరో అభ్యర్థి కోర్టును ఆశ్రయించగా అవే ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు మరోమారు స్పష్టంచేసింది. వీరేకాదు మరెందరో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
టీజీటీ, డీఎల్, జేఎల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ట్రిబ్ విడుదల చేసిన జాబితా అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఫిమేల్ జెండర్‌పై మేల్ క్యాండిడేట్లను ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. డీఎల్ ఇంగ్లిష్, జేఎల్ ఫిజిక్స్ పోస్టులకు సంబంధించి ఆ జాబితాలో ఇద్దరిని ఫిమేల్ జెండర్‌గా చూపిస్తూ ఇద్దరు పురుష అభ్యర్థులను ఎంపిక చేసింది.
లైబ్రేరియన్ పోస్టులను కూడా అనర్హులకు కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 434 లైబ్రేరియన్ పోస్టులకు ట్రిబ్ నోటిఫికేషన్ జారీచేసింది. అందులో 418 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించింది. లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం 2014 తరువాత ఆచార్య నాగార్జున, అలగప్ప, ద్రవిడతోపాటు ఇతర రాష్ర్టాల్లోని యూనివర్సిటీల నుంచి లైబ్రేరియన్ సైన్స్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు అనర్హులు. అయినప్పటికీ ఆ నోటిఫికేషన్‌కు విరుద్ధంగా పలువురిని ఎంపికచేశారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలా ఎంపికైన ఐదుగురిని గుర్తించినట్టు చెప్తున్నారు.
పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రణాళిక లేకుండా సాగడం, ఒక్క రోజు వ్యవధిలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేయడం, వారం రోజుల్లోనే నియామక పత్రాలు అందజేయడం కారణంగా అవకతకలు చోటుచేసుకున్నట్టు అభ్యర్థులు విమర్శిస్తున్నారు. పోస్టుల వారీగా వెలుగులోకి వస్తున్న ఘటనలే అందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధికోసం ప్రభుత్వం చేసిన ఈ హడావుడితో అభ్యర్థులు నష్టపోతున్నారని వాపోతున్నారు.