Junior Doctors | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడంతో ఈ నెల 30 నుంచి ధర్నా చేపట్టనున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (టీ-జూడాలు) వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం టీ జూడాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్ న్యూటన్ ఓ ప్రకటన విడుదల చేశారు. స్టైఫండ్ చెల్లింపులో జాప్యం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, బోధనా సిబ్బంది కొరత, స్కాలర్షిప్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో ఆలస్యంపై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రం అందజేసిన ఫలితం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 30 నుంచి చేపట్టిన ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.