హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా నేటి (బుధవారం) నుంచి రేషన్ సరఫరా చేయనున్నట్టు సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జూలై కోటా కింద రాష్ట్ర వ్యాప్తంగా 2.15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిద్ధంగా ఉంచినట్టు ప్రకటించారు.
కేంద్ర ఆహార పంపిణీ శాఖ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ కోటా కింద ఏప్రిల్ 30 నాటికి 6.08 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసినట్టు వెల్లడించారు. ఆన్లైన్ లావాదేవీలు, వేలిముద్రల విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి రేషన్ షాపులో ఈ-పాస్ యంత్రాల ద్వారానే పంపిణీ జరుగుతుందని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.