హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ సమాజ పరిణామ చైతన్య వికాస క్రమాన్ని కవులు, రచయితలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కలమెత్తి రాయాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. చరిత్రను వక్రీకరించి వక్రభాష్యాలు చెప్పే వారి విషయంలో తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గజల్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో కందిబండ విజయలక్ష్మి రచించిన ‘చంద్రముఖి’ గజల్ సంపుటిని ఆదివారం ఆయన రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ మన తరతరాల చరిత్రను వివిధ సాహిత్య ప్రక్రియల ద్వారా విస్తృతంగా రచించుకొని వాటిని భావితరాలకు అందించాలని చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణ మట్టి నుంచి ఎగిసిన పోరాటాలన్నీ మానవీయ మహాజనావళి పోరాటాలేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజల్ కొరుప్రోలు మాధవరావు, కాళోజీ అవార్డు గ్రహీత, కవి విమర్శకులు డాక్టర్ సీతారాం, విశ్రాంత ప్రొఫెసర్ ముకుంద సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.