ధర్మపురి/కమలాపూర్, డిసెంబర్ 31 : బాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల్లో నిందితులకు 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు బాధితులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ జగిత్యాల, హనుమకొండ జడ్జీలు మంగళవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇలా.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ముగ్గురు బాలికలపై శివరాత్రి ముత్తయ్య అనే వ్యక్తి 12 అక్టోబర్ 2023న లైంగిక దాడి చేసిన ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద అప్పటి ఎస్సై నరేశ్ కేసు నమోదు చేశారు.
డీఎస్పీలు వెంకటస్వామి, రఘుచందర్ కేసును వేగవంతంగా విచారించి ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. పీపీ రామకృష్ణారావు, కోర్టు అధికారులు సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి నీలిమా సాక్షులను విచారించారు. మూడు కేసులకు సంబంధించి నేరం రుజువు కావడంతో నిందితుడికి ఒక్కో కేసుకు సంబంధించి 20 ఏండ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతోపాటు రూ.1000 జరిమాన, బాధితులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.
కమలాపూర్ కేసులో..
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన దాసరి సంపత్ 2018లో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఓ బాలికపై లైంగిక దాడి చేసినట్టు అప్పట్లో కేసు నమోదైనట్టు సీఐ హరికృష్ణ తెలిపారు. అప్పటి ఏసీపీ కే సత్యనారాయణ కేసు విచారణ అధికారిగా ఉన్నారు. కాగా మంగళవారం హనుమకొండ కోర్టులో కేసు విచారణకు రావడంతో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అపర్ణాదేవి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.27 వేల జరిమానా, బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించినట్టు సీఐ తెలిపారు.