హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘జూబ్లీహిల్స్ నా ఇల్లు.. నా ప్రాంతం.. ఎక్కడినుంచో వచ్చి నన్ను టార్గెట్ చేస్తే.. మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీదాటరు. మీరు మీ ఇల్లు చూడరు’ అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి బెదిరింపులకు పాల్పడ్డారు. ‘రౌడీషీటర్లతో మార్నింగ్‌వాక్’ అంటూ ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం జూబ్లీహిల్స్‌తోపాటు నగరవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంట్లోనే రౌడీషీటర్లు అయిన ఆయన తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్, బాబాయ్ రమేశ్‌యాదవ్.. ఉండటంతో నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కనిపించకపోవడం, రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలతో నవీన్‌యాదవ్ తీవ్ర అసహనంతో ఊగిపోతున్నారు. మంగళవారం రెహ్మత్‌నగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్‌యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కసారిగా ఫ్రస్ట్రేషన్‌కు లోనయ్యారు.
తన ప్రచారంలో ఓటర్లను తన సహజ నైజంతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తనవెంట ఉన్నవారితో కూడా ‘ఇంకా ఎంతసేపు తిరగాలి’ అంటూ చిర్రుబుర్రులాడుతున్నారు. దీంతో ఆయన వెంట ఉన్నవారు సైతం ఇదేం పద్ధతి అంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఓటమి భయంతో తీవ్ర అసహనానికి గురవుతున్న నవీన్‌యాదవ్.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను బెదిరిస్తూ కామెంట్స్ చేశారు. ఎవరైనా తనపై వ్యాఖ్యలు చేస్తే వాళ్లే కాదు.. వాళ్ల బాసులు కూడా జూబ్లీహిల్స్ గల్లీ కూడా దాటలేరంటూ దురుసుదనం ప్రదర్శిస్తున్నారు. నవీన్‌యాదవ్ ఇస్తున్న వార్నింగ్‌లు, ఆయన చేస్తున్న కామెంట్లు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. తమను ఓట్లు అడగడానికి వచ్చిన క్రమంలో ఆయన మాట్లాడుతున్న తీరు కూడా బెదిరింపు ధోరణిలో ఉంటున్నదని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. ‘ఎవరైనా నా జోలికి వస్తే, వాళ్లు ఇక్కడ గల్లీ కూడా దాటరు, వాళ్ల ఇల్లు మళ్లీ చూడర’ంటూ బెదిరిస్తున్న తీరు రౌడీయిజానికి నిదర్శనమని చర్చించుకుంటున్నారు.
బయటివారు వస్తే మళ్లీ తిరిగివెళ్లరంట..!
‘నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తే ఖబర్దార్..’ అంటూ నవీన్‌యాదవ్ చేసిన వ్యాఖ్యలు జూబ్ల్లీహిల్స్లో కలకలం రేపుతున్నాయి. తన ఏరియా జూబ్లీహిల్స్‌కు ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారంటూ ఇతర ప్రాంతం నుంచి వచ్చినవారిపై అక్కసు వెళ్లగక్కారు. నవీన్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచా రం చేస్తున్నవారంతా పూర్తిగా ఇదే ప్రాంతం వారా? బయటనుంచి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇదే వార్నింగ్ వర్తిస్తుం ది కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. తనకు టికెట్ ఖరారైన వెంటనే ‘పీజెఆర్ నాన్‌లోకల్’ అంటూ వ్యాఖ్యానించిన నవీన్‌యాదవ్‌పై కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత గూడుకట్టుకుని ఉన్నది. ఆ వ్యాఖ్యలు మరవకముందే లోకల్, నాన్‌లోకల్ అంటూ కామెంట్లు చేయడం, బయటనుంచి వచ్చినవారు మళ్లీ మీ ఇల్లు చూడరంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం వేలాదిమంది సెట్లర్లలో చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు పోలింగ్ తేదీకి 48 గంటల ముందు వరకు బయటప్రాంతాల వ్యక్తులు రావడం సహజమని, ఇలాంటి అనుచిత కామెంట్లతో బెదిరించడం సమాజానికి ఏం సందేశం ఇస్తుందనే చర్చ జరుగుతున్నది.
నమస్తే తెలంగాణలో వచ్చిందేంటి.. నవీన్‌యాదవ్ మాట్లాడిందేంటి!
‘నమస్తే తెలంగాణ’పై నవీన్‌యాదవ్ అక్కసు వెళ్లగక్కారు. ‘నమస్తే తెలంగాణలో నవీన్‌యాదవ్ రౌడీ అని, రౌడీషీటర్ అని రాశారు. నా మీద ఏమైనా రౌడీషీట్ ఉన్నదా? నా మీద కేసులున్నాయా?’ అంటూ మీడియా ఎదుట చిందులు తొక్కారు. అసలు నమస్తే తెలంగాణలో వచ్చిన కథనమేంటో తెలుసుకోకుండానే.. ఆ వార్తను చదవకుండానే పత్రికపై విషం చిమ్ముతూ అబద్ధాలు మాట్లాడారు. నవీన్‌యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలంయాదవ్పై మధురానగర్ పీఎస్‌లో రౌడీషీట్ నమోదై ఉండటం.. ఆయనతోపాటు ఆయన తమ్ముడు రమేశ్‌యాదవ్, మరికొందరు రౌడీషీటర్లను ఎన్నికల కారణంగా పోలీసులు బైండోవర్ చేశారని నమస్తే తెలంగాణ కథనంలో స్పష్టంగా ఉన్నది. అంతేకాకుండా, రౌడీషీటర్‌తో మార్నింగ్‌వాక్ చేస్తున్నారంటూ చిన్నశ్రీశైలంయాదవ్, మంత్రి సీతక్క మార్నింగ్‌వాక్ చేస్తున్న ఫొటోలతో కథనం ప్రచురించింది. కానీ, ఈ కథనంలో ఎక్కడా నవీన్‌యాదవ్ రౌడీ అని కానీ, రౌడీషీటర్ అని కానీ పేర్కొనలేదు. ఇదిలా ఉంటే తన తండ్రి కానీ, బాబాయ్కానీ రౌడీషీటర్లు కాదని చెప్పుకోలేని స్థితిలో ఉన్న నవీన్‌యాదవ్.. ఈ వ్యవహారంపై ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఉల్టా నమస్తే తెలంగాణపై విషం కక్కుతున్నారు. దీనిని చూసి ఆ ప్రాంత ప్రజలు నవ్వుకుంటున్నారు. నమస్తే తెలంగాణలో వస్తున్న వాస్తవాలను జీర్ణించుకోలేక ఆయన మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.