హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 14న కౌంటింగ్ చేపట్టి, ఫలితాన్ని ప్రకటిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదలవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21వ తేదీని తుది గడువుగా విధించారు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉప ఎన్నికకు సోమవారం షెడ్యూల్ జారీకావడంతో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశంలో ప్రకటించారు. నవంబర్ 14న యూసుఫ్‌గూడలోని కేవీఆర్ స్టేడియం లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు తెలిపారు. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతిచెందిన నేపథ్యంలో ఈ ఉపఎన్నిక జరగనున్నది. బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ పేరును ఆ పార్టీ ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్