హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): మహిళా జర్నలిస్టు స్వేచ్ఛ మరణంపై సోషల్ మీడియా, యూట్యూబ్ చానళ్లలో వస్తున్న కథనాలు చాలా బాధ కలిగిస్తున్నాయని సహచర జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (జేసీహెచ్ఎస్ఎల్) కార్యాలయంలో సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో స్వేచ్ఛ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. కొన్ని మీడియా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే సహించేది లేదని హెచ్చరించారు. ఎంతో ధైర్యవంతురాలైన సేచ్ఛ ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదని ‘ఆంధ్రజ్యోతి’ మాజీ ఎడిటర్ కే శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు.