హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్ స్వేచ్ఛ (Journalist Swetcha) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గాంధీనగర్‌లోని ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తున్నది. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. తల్లి శ్రీదేవి ఇంట్లో లేనప్పుడు స్వేచ్ఛ ఉరివేసుకున్నట్టు తెలుస్తున్నది. తల్లి ఇంటికి వచ్చి చూడగా స్వేచ్ఛ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించినట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తున్నది. స్వేచ్ఛకు వివాహం కాగా విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఓ కుమార్తె ఉన్నారు.
ప్రస్తుతం టీన్యూస్‌లో యాంకర్‌గా పని చేస్తున్న స్వేచ్ఛ.. గతంలో టీవీ9, వీ6, హెచ్ఎంటీవీ, 10టీవీ, మహాటీవీలో కూడా పని చేశారు. జర్నలిస్ట్‌గా, కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. మట్టిపూలగాలి అనే పుస్తకం ప్రచురించారు. జర్నలిస్ట్ సంఘాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఇటీవలే జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న స్వేచ్ఛ తండ్రి శంకర్ కూడా తెలంగాణ శంకర్‌గా ఉద్యమకారులకు, ప్రజాసంఘాల నాయకులకు సుపరిచితులే.