హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) తొలి మహిళా అధ్యక్షురాలిగా సంగీతా బరూవా పిషారోటి ఎన్నికయ్యారు. డిసెంబర్ 13న జరిగిన ఎన్నికల్లో పిషారోటి బృందం కార్యనిర్వాహక, మేనేజింగ్ కమిటీలోని అన్ని పదవులు కైవసం చేసుకున్నది. 21-0 తేడాతో ఘన విజయం సాధించింది. పిషారోటి 1,019 ఓట్లతో భారీ విజయం సాధించగా, ప్రత్యర్థులు అతుల్ మిశ్రా 129 ఓట్లు, అరుణ్ శర్మ 89 ఓట్లు పొందారు. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడిన అఫ్జల్ ఇమామ్‌కు 948 ఓట్లు రాగా, ప్రత్యర్థి జ్ఞాన్ ప్రకాష్‌కు 290 ఓట్లు వచ్చాయి.
పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా రెండోసారి తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన పబ్బ సురేశ్‌బాబు ఎన్నికయ్యారు. పీసీఐ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంఎంసీ శర్మ, బృందం ఆదివారం పీసీఐ ప్రాంగణంలో ఫలితాలు ప్రకటించారు. 16 మంది సభ్యుల మేనేజింగ్ కమిటీ ఎన్నికల్లో నీరజ్‌కుమార్ 932 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు. పబ్బ సురేశ్‌బాబు(838) ఓట్లు సాధించారు. సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల వాయిస్ వినిపించేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు.