ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు హైదరాబాద్లోని నిజాం కళాశాలలో జరిగే 17వ హెచ్ఎఫ్ఐ మిని బాల, బాలికల జాతీయ స్థాయి ( National level competitions ) హ్యాండ్ బాల్ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నలుగురు రెఫెరీలు ( Referees ) గా ఎన్నికయ్యారు. సునార్కర్ అరవింద్, దుర్గం రాజలింగు,గోగర్ల సాయి కుమార్,రాజశేఖర్ ఎంపికైనట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ తెలిపారు.
ఈ రెఫెరీలు గతంలోను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని వివరించారు. దేశ అత్యున్నత క్రీడా శిక్షణ సంస్థ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పటియాలలో క్రీడా శిక్షణ శిక్షకులుగా శిక్షణ పూర్తి చేశారని తెలిపారు. జాతీయ స్థాయిలో ఎంపిక కావడంతో ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కోశాధికారి రమేష్ రెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఇన్చార్జి ప్రెసిడెంట్ అరిగేలా మల్లికార్జున్ యాదవ్ , డీడీ రమాదేవి , పలువురు అభినందించారు.