వనపర్తి, సెప్టెంబర్ 13 : రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం రేవల్లి, పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాలకు చెందిన 250 మంది కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు మంత్రి నిరంజన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. పదేండ్లల్లో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ తీసుకురావడంతో నేడు ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు దర్శనమిస్తున్నాయన్నారు.
నాడు వలసలకు పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు పాడి పంటలకు నిలయంగా మారిందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుందన్నారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని పెద్ద మునగల్ కన్మనూర్ గ్రామాలకు చెందిన ఆరుగురికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఆ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.