హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సైస్టెనబిలిటీ(ఐసీఎఫ్సీ) సేవలు స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. లండన్ ైక్లెమెట్ యాక్షన్ వీక్ యాత్రలో భాగంగా ఐసీఎఫ్సీని సందర్శించడం మధురానుభూతి మిగిల్చిందని సంతోష్ అభివర్ణించారు. సచిన్ నంద, ఆయన బృందాన్ని కలవడంపై హర్షం వ్యక్తంచేశారు. తమ భేటీలో యూకే-భారత్ సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ, విభిన్న సంస్కృతులు, సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం, ఏఐ, ప్రివెంటివ్ హెల్త్ కేర్‌పై సుదీర్ఘంగా చర్చించినట్టు పేర్కొన్నారు. భారత్, పశ్చిమ దేశాల మధ్య వారధిగా నిలుస్తున్న ఐసీఎఫ్సీ సంస్థ పరిశోధన సేవలు అభినందనీయమని సంతోష్ కొనియాడారు. ఐసీఎఫ్సీతో కలిసి ముందుకు సాగేందుకు ఈ భేటీ ఎంతో దోహదపడిందని వెల్లడించారు.