‘హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు ‘గెట్ జాబ్ రెడీ.. హౌ టూ ల్యాండ్ యువర్ డ్రీమ్ జాబ్ అవుట్ ఆఫ్ కాలేజీ’ పుస్తకాలను ఉచితంగా అందిం చేందుకు అమెరికాలోని చికాగోకు చెందిన బౌర్న్టెక్ సొల్యూషన్స్ సంస్థ ముందుకొచ్చింది. నవతరం విద్యార్థులకు కొత్త దారి చూపుతున్న ఈ పుస్తకాన్ని వాసు ఈద రచించగా, పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ప్రచురించింది. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని తన కార్యాలయంలో కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ చేతులమీదుగా తొలివిడతగా 100 పుస్తకాలను డిగ్రీ కాలేజీలకు సంస్థ అందజేసింది. ఉద్యోగాలకు సన్నద్ధం కావడం.. శోధించడం ఎలాగో ఈ పుస్తకం వివరిస్తుంది. దీనిని చదివితే సొంతంగా ఎవరికి వారే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొనేలా విద్యార్థులు తయారవుతారు. కార్యక్రమంలో బౌర్న్టెక్ సొల్యూషన్స్ ప్రెసిడెంట్ సృజన గూడూరు, పుస్తక రచయిత వాసు తదితరులు పాల్గొన్నారు.