హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : పోలీస్ ఉద్యోగాల కోసం అహర్నిశలు కష్టపడుతున్న నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు చే యించుకున్న కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్ ఇచ్చిన పోలీస్ ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకొని, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగాల కోసం రాస్తారోకోలు, మెరుపు ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. 2022లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినవే నోటిఫికేషన్లు అని, నాటి నుంచి నేటి వరకు ఒక్క పోలీస్ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. ఉద్యోగాల కోసం దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, అశోక్‌నగర్‌లో పోరుబావుటా ఎగురవేశారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి 20 వేల పోస్టులతో మెగా పోలీసు నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని, నోటిఫికేషన్ల జాప్యం వల్ల వయసు కోల్పోయిన అభ్యర్థులకు వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవో 46ను పూర్తిగా రద్దుచేయాలని, లాంగ్‌జంప్‌ను 3.8 మీటర్లకు తగ్గించాలని ప్రధానంగా కోరుతున్నారు. ఈ విషయంపై మార్చి 10న నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగులను జిల్లాలు, పట్టణాల్లో ముందుస్తు అరెస్టులు చేశారు. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
2016, 2018, 2022లో ప్రతి నోటిఫికేషన్లోనూ కనీసం 16 వేలకు తగ్గకుండా నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2022లో తెలంగాణలో 17,516 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 48,096కు పైగా పోలీసు ఉద్యోగాలు ఇప్పించారు. 2022లో భారీ నోటిఫికేషన్, పరీక్షలు, ఫిజికల్ టెస్టులు, ఫైనల్ పరీక్షలు, తుది ఫలితాల ప్రకటన కూడా కేసీఆర్ హయాంలోనే జరిగాయి. అభ్యర్థులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి 17,516 ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకున్నది. 2022 ఏప్రిల్ నుంచి నేటి వరకు దాదాపు 4 ఏండ్లు పూర్తయినా పోలీసుశాఖలో ఒక్క పోలీసు ఉద్యోగానికి కూడా రేవంత్ సర్కార్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోవడం సిగ్గుచేటని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఓవైపు పోలీస్‌శాఖలో భారీగా ఖాళీలున్నా వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వంలో రావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడిస్తామన్న 5 వేల ఉద్యోగాల కోసం దాదాపు 12 లక్షల మందికిపైగా పోటీ పడుతారని చెప్తున్నారు. ఒక్కో పోస్టుకు దాదాపు 500 మంది పోటీ పడే దుస్థితి వస్తుందని వాపోతున్నారు.
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలిస్తున్నారు. దీంతో రెండున్నరేండ్లుగా 20 వేల పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. 17 వేల ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేసి తెలంగాణ పోలీసు బలాన్ని పెంచాలని మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి ప్రభుత్వానికి విన్నవించినా కేవలం 5 వేల పోలీసు పోస్టుల భర్తీకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారంలోకి రాకముందు.. ఏడాదికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక తమను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ తాత్సారం వల్ల దిల్సుఖ్నగర్ లాంటి ప్రాంతాల్లో అప్పులు చేసి మరీ ఏండ్ల తరబడి నిరుద్యోగులు తీసుకుంటున్న కోచింగ్‌కు అర్థం లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.