హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): అవినీతి, అక్రమ ఆరోపణలు ఉన్న వ్యక్తికి జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎప్‌సెట్-26 కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమవుతున్నది. ప్రతిష్టాత్మకమైన సెట్‌కు కే విజయ్‌కుమార్‌రెడ్డి అనే సీమాంధ్రకు చెందిన ప్రొఫెసర్‌ను నియమించడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. హైదరాబాద్ జేఎన్టీయూలో తెలంగాణ ప్రొఫెసర్లు లేరా? లేదా ఈ ప్రాంతం వారికి సెట్ నిర్వహించడం చేతగాదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎప్‌సెట్-26 కన్వీనర్‌గా నియామకమైన వ్యక్తిపై గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయని విద్యార్థి యూనియన్ల నాయకులు చెబుతున్నారు. గతంలో ఎంసెట్ డాటాను విక్రయించినట్టు, జేఎన్టీయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో ఉన్నప్పుడు సైతం ఆరోపణలు వచ్చాయని పేర్కొంటున్నారు.
ఈ పరిస్థితుల్లో 16 ఏండ్ల నుంచి ఇతడిని యూనివర్సిటీ ఉన్నతాధికారులు దూరం పెట్టారని, సింగరేణి పరీక్షల నిర్వహణలోనూ విజయ్‌కుమార్‌రెడ్డి అవకతవకలకు పాల్పడినట్టు తెలిసిందని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా జేఎన్టీయూ ఎగ్జామ్ బ్రాంచ్‌లో జరిగిన అక్రమాలకు బాధ్యతగా రిజిస్ట్రార్ వెంకటేశ్వర్రావుపై వేటు వేయాల్సిందిపోయి బోనస్‌గా పీజీఈసెట్ కన్వీనర్ ఇవ్వడంలో మతలబు ఏంటో అర్థంకావడంలేదని విద్యార్థి యూనియన్ల నాయకులు అంటున్నారు. వీసీతో కుదిరిన అవగాహన ఒప్పందంమేరకే వీరిని సెట్ కన్వీనర్లుగా నియమించారని జేఎన్టీయూహెచ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. వీరి నియామకాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్‌ను డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.