దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీల్లో ఒకటైన జేఎన్టీయూ తప్పటడుగులు వేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఫారిన్ కోర్సుల పేరుతో ఓ నకిలీ విద్యాసంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపిస్తున్నారు. జేఎన్టీయూ ఇటీవలే జర్మనీకి చెందిన రోట్లింజన్ నాలెడ్జ్ ఫౌండేషన్ యూనివర్సిటీ (కేఎఫ్‌ఆర్‌యూ)తో ఎంవోయూ కుదుర్చుకున్నది. అయితే అది నకిలీ వర్సిటీ అంటూ జర్మనీలోని తెలుగు పౌరులు, విద్యావేత్తలు తదితరులు జేఎన్టీయూకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అసలు రోట్లింజన్ వర్సిటీకి కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా జేఎన్టీయూ అధికారులు మాత్రం అప్రమత్తం కావడం లేదని విద్యావేత్తలు మండిపడుతున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఇటీవలే జర్మనీకి చెందిన ‘రోట్లింజన్ నాలెడ్జ్ ఫౌండేషన్ యూనివర్సిటీ’(కేఎఫ్‌ఆర్‌యూ) పేరుతో జేఎన్టీయూ కుదుర్చుకున్న ఒప్పందం దుమారం రేపుతున్నది. నకిలీ విద్యాసంస్థతో ఎంవోయూ కుదుర్చుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక ఆరోపణలు వస్తున్నా.. వర్సిటీ అధికారులు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. మొండిగా ముందుకెళ్తే, విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ సర్టిఫికెట్లు చెల్లుబాటు కాకపోతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జేఎన్టీయూ రిజిస్ట్రార్ కే వెంకటేశ్వర్రావును ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. నోటిఫికేషన్లో ఇచ్చిన జేఎన్టీయూ అకడమిక్ డైరెక్టర్ ఫోన్ నంబర్లను సంప్రదిస్తే కౌన్సిలర్లు బదులిస్తున్నారు. జేఎన్టీయూ ఇటీవలే జర్మనీకి చెందిన రోట్లింజన్ నాలెజ్డ్ ఫౌండేషన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నది.
ఇందులో భాగంగా ఐదున్నరేండ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ అండ్ మాస్టర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఇన్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ (ఐఐబీఎంపీ), రెండేండ్ల ఇంటర్నేషనల్ మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐఎంపీ) కోర్సులు నిర్వహించనున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. అయితే జర్మనీలో ‘రోట్లింజన్ హోప్ షూ లే’ అనే యూనివర్సిటీ కూడా ఉన్నది. ఈ వర్సిటీకి రోట్లింజన్ నాలెజ్డ్ ఫౌండేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఇటీవలే కొందరు జేఎన్టీయూకు మెయిల్ ద్వారా ఫిర్యాదుచేశారు. జర్మన్ అకడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ ‘డాడ్’లో కూడా కేఎఫ్‌ఆర్‌యూ నమోదుకాలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఒకే పేరు ఉండటంతో ఫౌండేషన్నే వర్సిటీగా భావిస్తున్నారంటూ వివరణ ఇచ్చారు. జేఎన్టీయూకు ఫౌండేషన్‌కు, వర్సిటీకి మధ్య తేడా కూడా తెలియదా? అని ప్రశ్నించారు.
జేఎన్టీయూలోనే గందరగోళం
‘రోట్లింజన్’ అనేది జర్మనీలోని ఒక ప్రాంతం. ‘హోప్ షూ లే’ అంటే జర్మనీలోని ఒక యూనివర్సిటీ. నిజమైన ‘రోట్లింజన్ హోప్ షూ లే’ యూనివర్సిటీ వెబ్సైట్లో జేఎన్టీయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఎక్కడా లేదు. జేఎన్టీయూ విడుదల చేసిన నోటిఫికేషన్లో ‘నాల్జెడ్ ఫౌండేషన్ ఆఫ్ రోట్లింజన్ యూనివర్సిటీ జర్మనీ’ అని పొందుపరిచారు. జేఎన్టీయూ వెబ్‌సైట్‌లోని ఇన్ఫర్మేషన్ బుక్‌లెట్‌లో ‘రోట్లింజన్ యూనివర్సిటీ ఆప్ అఫ్లయిడ్ సైన్స్’ అని పేర్కొన్నారు. మరోచోట ‘రోట్లింజన్ నాలెజ్డ్ ఫౌండేషన్ యూనివర్సిటీ (కేఎఫ్‌ఆర్‌యూ)’ అని ప్రచురించారు. ఇది తీవ్రగందరగోళానికి దారి తీస్తున్నది. మూడింటిలో ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విద్యావేత్తలు, తల్లిదండ్రులు కూడా ఇదే అంశంపై జేఎన్టీయూ హెల్ప్లైన్లకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అయినా వర్సిటీ వర్గాల నుంచి సరైన సమాధానం రావడం లేదు. వాస్తవానికి యూరోపియన్ చట్టాల ప్రకారం యూరప్ ఖండం వారెవరైనా జర్మనీలో విద్యాసంస్థలు పెట్టుకోవచ్చు. వ్యాపారం చేసుకోవచ్చు. బల్గేరియా వంటి చిన్న దేశాల్లో విద్యా సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకుని జర్మనీలో శాఖలను తెరుస్తుంటాయి. ఈ ఫౌండేషన్ కూడా అదే కోవకు చెందినదై ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆన్లైన్లో రోట్లింజన్ నాలెజ్డ్ ఫౌండేషన్ వర్సిటీకి, రోట్లింజన్ హోప్ షూ లే వర్సిటీకి సంబంధం లేదని స్పష్టం అవుతున్నది.
సమాధానం లేని ప్రశ్నలెన్నో