JNTU | హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): జర్మన్ విద్యా సంస్థతో జేఎన్టీయూ కుదుర్చుకున్న ఒప్పందంలోని లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐదున్నరేండ్ల కోర్సు కోసం ఐదేండ్లు ఒప్పందం చేసుకోవడం ఇందులోని మరో వింత. ఐదేండ్ల తర్వాత ఒప్పందాన్ని సమీక్షించాలన్న నిబంధనను ఎంవోయూలో పొందుపరిచారు. దీంతో ఒకవేళ ఐదేండ్ల తర్వాత ఒప్పందం రద్దయితే కోర్సులో చేరిన విద్యార్థుల భవిష్యత్తేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందంలోని మరో విషయం ఏమంటే, ఒప్పందాన్ని రెండు సంస్థలు ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. అయితే, ఆ ఏడాది డిసెంబర్ 31 లోపు నోటీసు అందజేయాల్సి ఉంటుంది. తదుపరి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి ఒప్పందం రద్దవుతుంది. ఒకవేళ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలిగించేలా ఇరు సంస్థలు వ్యవహరించరాదన్న షరతు ఉంది. అయితే, ఒప్పందాన్ని ఉల్లంఘించినా, మొండికేసినా మనం వెళ్లి జర్మనీలో సదరు సంస్థపై కేసులు పెట్టడం, న్యాయస్థానాల్లో పోరాడటం సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలొస్తున్నాయి. విద్యార్థి సంఘాల డిమాండ్లు, మీడియా అనుమానాల నేపథ్యంలో ఎట్టకేలకు జేఎన్టీయూ అధికారులు ఒప్పంద పత్రాలను బహిర్గతం చేశారు. అయితే ఈ ఒప్పందంలోని అంశాల పట్ల అనేక అనుమానాలొస్తున్నాయి.
ఈ కోర్సులో చేరినవారు ప్రతి ఒక్కరూ జర్మన్ లాంగ్వేజ్ కోర్సులు చదవాలని పొందుపరిచారు. కోర్సులో చేరిన వారు జీసీ జర్మన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ (జీఎంబీఎహెచ్)లోనే నాలుగు జర్మన్ లాంగ్వేజ్ కోర్సులను చదవాలి. ఈ సంస్థే జర్మన్ లాంగ్వేజ్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఇతరుల దగ్గర ఈ నాలుగు కోర్సులను నేర్చుకోవడం వీలుపడదు. అంటే ఈ కోర్సుల పేరు మీద మళ్లీ ఒక్కో కోర్సుకు కొంత చొప్పున వసూలు చేసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలా వసూలు చేస్తే బాధ్యలెవరు.
రోట్లింజన్ వర్సిటీ, నాల్జెడ్ ఫౌండేషన్ రోట్లింజన్ యూనివర్సిటీ (కేఎఫ్‌ఆర్‌యూ) వేర్వేరు అన్న అనుమానాలున్నాయి. జేఎన్టీయూ ఎంవోయూ కాపీలో కేఎఫ్ఆర్యూతో ఒప్పందం చేసుకున్నట్టు ఉంది. అయితే మాస్టర్స్ డిగ్రీని మాత్రం రోట్లింజన్ వర్సిటీ నుంచే ఇస్తామన్నారు. అయితే రోట్లింజన్ వర్సిటీ ప్రెసిడెంట్‌గా ప్రొఫెసర్ హెన్రిడ్ బ్రూమ్ కొనసాగుతున్నారు. ఆయనతో జేఎన్టీయూకు ఒప్పందముంది. ఈ కోర్సులో చేరిన వారికి తాము మాస్టర్స్ డిగ్రీని ఇస్తామని ఓ లేఖను ఇప్పిస్తే సరిపోతుందని విద్యార్థి సంఘాలంటున్నాయి. వర్సిటీ అధికారులు సందేహాలను పటాపంచలు చేస్తూ ఆయన్నుంచి లేఖను తెప్పించాలని కోరుతున్నారు.
రోట్లింజన్ వర్సిటీతో కాకుండా నాలెజ్డ్ ఫౌండేషన్ రోట్లింజన్ యూనివర్సిటీ (కేఎఫ్‌ఆర్‌యూ) తో ఎందుకు ఒప్పందం చేసుకున్నారంటే వర్సిటీ అధికారులు చెప్తున్న సమాధానాలు వింతగా ఉన్నాయి. అసలు రోట్లింజన్ వర్సిటీ ఎలాంటి ఒప్పందాలు కుదర్చుకోదని, కేఎఫ్‌ఆర్‌యూ ఒప్పందాలు చేసుకుంటుందని వింతడవాదాన్ని వినిపించారు. లోతుగా పరిశీలిస్తే రోట్లింజన్ వర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా 200 పార్ట్నర్ యూనివర్సిటీలున్నాయి. మన దేశంలో జేపీ జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్‌తో ఒప్పందం చేసుకుంది. జపాన్‌లో రెండు, ఆస్ట్రేలియాలో 8, చైనాలో 11, డెన్మార్క్‌లో 3, కెనడా నుంచి 7 వర్సిటీలతో రోట్లింజన్ వర్సిటీకి ఒప్పందాలున్నాయి. 200 వర్సిటీలతో ఒప్పందాలుండగా, ఆ వర్సిటీ ఒప్పందం చేసుకోదని చెప్పడం గమనార్హం.