హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): జూనియర్ లెక్చరర్ల భర్తీకి 26 నుంచి 31 వరకు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు 298 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు బుధవారం టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. వివరాలు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్టు అధికారులు స్పష్టంచేశారు.
జేఎన్టీయూ అభివృద్ధిపై శీతకన్ను
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూకు చెందిన ఐదు ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల హాస్టళ్ల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. నిధుల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తుంది. జేఎన్టీయూ కూకట్‌పల్లిలోని హాస్టల్‌తో పాటు, ఇంజినీరింగ్ కాలేజీ సుల్తాన్పూర్, ఫార్మసీ కాలేజీ సుల్తాన్పూర్, ఇంజినీరింగ్ కాలేజీ జగిత్యాల, ఇంజినీరింగ్ కాలేజీ మంథని వంటి కాలేజీ హాస్టళ్లు ఆధ్వానంగా మారాయి. అభివృద్ధికి రూ.2.27 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరుతూ 15న ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్డర్ కే వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన స్పందన లేదని అధికారులు తెలిపారు.
డీఈఈ సెట్లో 71.53 % ఉత్తీర్ణత
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కాలేజీలలో సీట్ల భర్తీకి 10న నిర్వహించిన(ఆన్లైన్)డీఈఈసెట్-2024 పరీక్ష ఫలితాలను సెట్ కన్వీనర్ బుధవారం విడుదల చేశారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో 71.53 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు కన్వీనర్ తెలిపారు. 15,150 మంది పరీక్షలకు రాయగా, 12,032 మంది అర్హత సాధించారు. ర్యాంకు కార్డులు https://deecet.cdse.telangana.gov.inలో పెట్టామని కన్వీనర్ పేర్కొన్నారు.