రవీంద్రభారతి, జనవరి 7 : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప ఆర్థిక సంస్కరణవాది అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తెలిపారు. రవీంద్రభారతిలో మంగళవారం పీవీ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పీవీ నరసింహారావు స్మారక పురస్కార’ ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ జ్యోతి ప్రజ్వనలం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ స్మారక అవార్డును అనువాద రచయిత నలిమెల భాస్కర్‌కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ స్వాతంత్య్ర సమరయోధుడిగా దేశానికి సేవలందించారని పేర్కొన్నారు.
పీవీ నరసింహారావు, కాళోజీనారాయణరావులు గొప్ప రచయితలుగా, గురుశిష్యులుగా పేరుప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. భారత్ దివాలా తీసే సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ప్రగతిపథంలోకి నడిపించారని తెలిపారు. రాజకీయ విలువలు పాటించిన పీవీ నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కేవీ రామచంద్రారావు, సుబ్బిరామిరెడ్డి, పీవీ మనోహరరావు, పీవీ ప్రభాకరరావు, విజయ్‌కుమార్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు, సినీ సుస్వరాలు వీక్షకులను అలరించాయి.