హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): దేశంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ట్రెండ్ సెట్టర్‌గా మారిందని జార్ఖండ్ పాత్రికేయులు ప్రశంసించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. జార్ఖండ్ కంటే 14 ఏండ్ల తర్వాత ఆవిర్భవించిన తెలంగాణ, ప్రగతిలో తమ రాష్ట్రంకంటే వందేండ్లు ముందున్నదని కితాబిచ్చారు. 16 మందితో కూడిన జార్ఖండ్ పాత్రికేయుల బృందం తెలంగాణలో పర్యటిస్తున్నది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరు తెన్నులు, చట్టాల అమలు తదితర అంశాలపై క్షేత్ర పరిశీలన చేస్తున్నది. ఈ బృందం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడింది. ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ తాను విజనరీ అని నిరూపించుకొన్నారని పాత్రికేయులు ప్రశంసించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావటంపై దేశవ్యాప్తంగా ఆసక్తి కర చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.
సంక్షేమ తెలంగాణ
రైతుబంధు, రైతుబీమా, షాదీముబారక్/ కల్యాణలక్ష్మి, జర్నలిస్టు సంక్షేమ నిధి వంటి పథకాలు ప్రజా సంక్షేమంలో విప్లవాత్మకమైనవని జార్ఖండ్ పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. ‘రైతుబంధు పథకం గురించి మొదట విన్నప్పుడు ఆశ్చర్యపోయాం. కొద్దికాలం తరువాత ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించినప్పుడు ‘యంగ్స్టేట్ తెలంగాణ.. డిసైడ్స్ ది నేషన్స్ ఫార్మర్స్ ఫ్యూచర్’ అనిపించింది. రైతు మరణిస్తే అతడి కుటుంబం అనాథ కాకుండా రూ.5 లక్షల బీమా వర్తింపజేయటం సాహసోపేత నిర్ణయం. ఇలాంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ప్రభుత్వం రూ.లక్ష ఇచ్చి అండగా నిలవడం దేశంలో ఎక్కడాలేదు’ అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో అనూహ్య మార్పులు
పదేండ్ల క్రితం హైదరాబాద్‌కు ఇప్పటి హైదరాబాద్‌కు పోలికే లేదని జార్ఖండ్ జర్నలిస్టు బృందం తెలిపింది. ఈ జర్నలిస్టు బృందంలో ముగ్గురు పాత్రికేయులు గతంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేశారు. దేశంలో హైదరాబాద్ మొదటి నుంచి ఐకానిక్ సిటీ అని, అయితే తాము పదేండ్ల తరువాత తిరిగి హైదరాబాద్‌ను చూస్తున్నపుడు మౌలిక సదుపాయాలు అత్యద్భుతంగా మారాయని తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమంలో
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్ల నిధిని ఏర్పాటుచేసిన విషయాన్ని తెలుసుకొని జార్ఖండ్ జర్నలిస్టులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఇంత చిన్న రాష్ట్రంలో 20 వేల అక్రెడిటేషన్లు ఉండటం అరుదైన విషయమని పేర్కొన్నారు. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి ఐదేండ్లపాటు పెన్షన్ ఇవ్వటం, వారి పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం చేయటం గొప్ప విషయమని అన్నారు. తమకూ ఇలాంటి నిధి ఏర్పాటుచేయాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు.
కేసీఆర్ విజనరీ లీడర్
స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడే పాలకుడు అయి తే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని కేసీఆర్ నిరూపించారు. మాకూ (జార్ఖండ్) శిబూసోరెన్ కొంతకాలం పాలించారు. అయితే అక్కడి సమస్యలు వేరు. అన్ని వర్గాలను సంక్షేమ పథకంలో నడిపించాలని కేసీఆర్ వేసిన దారి లో అందరూ నడవాల్సిన పరిస్థితిని కల్పించారు. దేశంలో కేసీఆర్ మార్క్‌పై చర్చ జరుగుతున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై జార్ఖండ్‌లోనూ చర్చ సాగుతున్నది.
– సంజయ్ రంజన్, జర్నలిస్టు
ప్రగతి వికేంద్రీకరణ అద్భుతం
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం అన్ని ప్రాంతాలకు విస్తరించింది. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ పర్యవేక్షణ పెరిగిందని విన్నాం. రెండు రోజులుగా కండ్లారా చూస్తున్నాం. జార్ఖండ్ కంటే తెలంగాణ 14 సంవత్సరాల తరువాత ఏర్పడినా అనేక విషయాల్లో వందేండ్ల ముందున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి.
– అనంద్ మోహన్, జార్ఖండ్ అసెంబ్లీ ప్రెస్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్
అందరికీ అభివృద్ధి ఫలాలు
జార్ఖండ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో జార్ఖండ్ రాష్ట్రం కోసం దశాబ్దాలపాటు ఉద్యమాలు జరిగాయి. ఇక్కడా (తెలంగాణ) కేసీఆర్ నాయకత్వంలో (టీఆర్ఎస్) ఉద్యమం జరిగింది. భౌగోళికంగా, సామాజికంగా జార్ఖండ్‌తో పోలిస్తే తెలంగాణ భిన్నమైనది. చైతన్యం పరంగా సమానమైనది. జల్, జంగిల్, జమీన్ కోసం జార్ఖండ్ పరితపించింది. జార్ఖండ్‌లో అత్యధికులు గిరిజనులే. తాము కోరుకున్న స్థాయిలో జీవితాలు మెరుగుపడలేదని వారిలో బాధ ఉన్నది. తెలంగాణలో అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కుతున్నాయని నివేదికలను బట్టి తెలుస్తున్నది. అంతకన్నా అదృష్టం ఏం కావాలి?
-సురేంద్ర సోరెన్, సీనియర్ జర్నలిస్టు
హైదరాబాద్ ఎంతో మారింది
నేను పదేండ్ల క్రితం హైదరాబాద్‌లో పనిచేశాను. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులను చూస్తున్నా. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు విపరీతంగా పెరిగాయి. పచ్చదనం అద్భుతం. హైదరాబాద్ అప్పటికే దేశంలో ఐకానిక్ సిటీల్లో ఒకటిగా ఉండేది. ఏడేనిమిదేండ్లలోనే ఇంత అనూహ్య మార్పులు జరగడం గొప్ప విషయం. విస్తరణ పెరిగే కొద్దీ ఆ మేరకు సౌకర్యాలు కల్పించటం అద్భుతం.
–ప్రదీప్‌సింగ్, సీనియర్ జర్నలిస్టు