జగిత్యాల, డిసెంబర్ 21: నడుమంత్రపోళ్లతో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతున్నదని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కొత్తగా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జీవన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారితో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు, స్పీకర్‌కు ‘మేము పార్టీ ఫిరాయించలేదు’ అని అఫిడవిట్ ఇచ్చారని ఎద్దేవాచేశారు. ఆఖరుకు సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రెస్మీట్లో ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని, వారంతా బీఆర్ఎస్లోనే ఉన్నారని మీడియాతో చెప్పారని గుర్తుచేశారు.
ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు చెందినవారేనని సీఎం చెప్పినా, సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులతో తిరగవట్టె.. ఇదెక్కడి న్యాయం..? అని ప్రశ్నించారు. వాళ్లది ఏ పార్టీయో వాళ్లకే తెలుస్తలేదు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నాయకులు పట్టుకెళితే.. కాంగ్రెస్ కార్యకర్తలు సుఖంగా నిద్రపోతారని చెప్పారు.