హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు జూన్ 9న విడుదలకానున్నాయి. జాతీయంగా ఆదివారం ఈ పరీక్షను నిర్వహించగా, తెలంగాణ నుంచి 24వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సెషన్‌తో పొల్చితే రెండో సెషన్లో ప్రశ్నలు అత్యంత కఠినంగా ఇచ్చారు. ఈసారి కెమిస్ట్రీ ప్రశ్నలు ఛేదించిన వారు మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశముందని నిపుణులు విశ్లేషించారు. జనరల్ కటాఫ్ 80-90 మార్కులొండచ్చని తెలిపారు. మెయిన్స్ సిలబస్‌లో నుంచి తొలగించి అడ్వాన్స్‌డ్‌లో కొనసాగించిన సిలబస్ నుంచి ప్రశ్నలొచ్చాయని పేర్కొన్నారు. 200 మార్కులొస్తే 5వేల లోపు ర్యాంకు వచ్చే అవకాముందని తెలిపారు.
31న రెస్పాన్స్షీట్ల విడుదల
ఇక గణితం, ఫిజిక్స్‌లో ప్రశ్నలు చదివేందుకు విద్యార్థులు కష్టపడ్డారు. పేపర్-1లో ప్రశ్నల సరళి మధ్యస్తం నుంచి కఠినంగా ఉన్నట్టుగా తెలిపారు. గణితం ప్రశ్నలు సులభం నుంచి మధ్యస్తంగా ఉండగా, కెమిస్ట్రీ మధ్యస్తంగా, ఫిజిక్స్ కాస్త కఠినంగా ఇచ్చినట్టు విద్యార్థులు చెప్పారు. కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలొచ్చాయి. ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే అధికంగా ప్రశ్నలిచ్చారు. కెమికల్ కైనటిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, అటామిక్ స్ట్రక్చర్, థర్మోడైనమిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలొచ్చాయి. పేపర్ -2లో గణితం ప్రశ్నలు పొడవుగా ఇచ్చారు. కానీ ప్రశ్నలు మధ్యస్తంగానే ఉన్నాయి. కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్, కైనటిక్స్, మెటలర్జీల నుంచి ప్రశ్నలిచ్చారు. ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రశ్నలు నేరుగా ఇవ్వడం విద్యార్థులకు సులభమైంది. జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్షీట్లను ఈనెల 31న విడుదలచేస్తారు. జూన్ 2న ప్రొవిజినల్ ఆన్సర్కీని విడుదలచేస్తారు. విద్యార్థులు జూన్ 3 వరకు అభ్యంతరాలు వ్యక్తంచేయవచ్చు.
కటాఫ్ 80 -90 మార్కుల వరకు ఉండొచ్చు
పేపర్ -1తో పోల్చితే పేపర్ -2 కాస్త కఠినంగా ఉంది. రెండు సెషన్లల్లో ఒకటి రెండు ప్రశ్నలు తడబడేవిగా ఉన్నాయి. గణితంలో కొన్నిప్రశ్నలు, ఫిజిక్స్‌లో ఒకటి రెండు ప్రశ్నలు పొడవుగా ఇచ్చారు. దీంతో విద్యార్థుల సమయం వృధా అయ్యింది. ఈ సారి జనరల్ కేటగిరి 80-90 మార్కుల వరకు ఉండొచ్చు.
– ఉమాశంకర్, శ్రీచైతన్య ఐఐటీ ఆలిండియా కో-ఆర్డినేటర్