హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 24వ ర్యాంక్ దక్కింది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పనితీరుపై భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే నివేదిక-2025 గురువారం విడుదలైంది. ఈ జాబితాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) 24వ ర్యాంక్‌ను సాధించింది.
ఈ వర్సిటీ 2015లో 6వ ర్యాంక్ సాధించగా, 2023లో అది 37కి పడిపోయింది. దీంతో విశ్వవిద్యాలయం ర్యాంకింగ్ మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ ఏడాది ర్యాంక్ మెరుగుపడిందని వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని ర్యాంకులు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.