ధర్మారం, ఫిబ్రవరి2: లయన్స్ క్లబ్(Lions Club) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం కోసం సమిష్టిగా కృషి చేయాలని ప్రముఖ కవి, కళాకారుడు జయరాజ్(Jayaraj) పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లిలోని మహేశ్వర ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ తన్నీరు రాజేందర్, క్లబ్ మహిళా ప్రధాన కార్యదర్శి తన్నీరు పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన రీజినల్ మీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ప్రజా సేవలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది అని అన్నారు.
ఈ క్లబ్ ద్వారా పేద ప్రజానీకానికి ఎంతో సేవలు చేయడంతో పాటు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సహకారాన్ని అందించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం అభినంద నీయ మన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవలు చేస్తూ మంచి గుర్తింపు పొందిన రీజినల్ చైర్మన్ రాజేందర్ ను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో రీజినల్ పరిధిలో రానున్న కాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
ప్లాస్టిక్ ప్రపంచానికి పెనుభూతంగా మారిందని, అందరూ అప్రమత్తంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారని విషయాన్ని అందరూ గ్రహించాలఅన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధానికి పాటుపడదామని క్లబ్ సభ్యులచే ప్రమాణం చేయించారు. ఆర్సీ చైర్మన్ రాజేందర్ జయరాజును ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు.