బోయినపల్లి, ఆగస్టు 9: జమ్మూకశ్మీర్‌లో మే 4న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ మృతిచెందగా, ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అనిల్ సతీమణి సౌజన్యకు కారుణ్య నియామకం కింద విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా కొలువు ఇచ్చింది. అనిల్ ఆర్మీలో సీఎఫ్ఎస్ టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా గత మే 4న జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ అటవీ ప్రాంతంలో ధ్రువ్ హెలిక్యాప్టర్ ప్రమాదంలో చనిపోగా, రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.
అనిల్, సౌజన్య దంపతులకు అయాన్, అరవ్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. జవాన్ అంతిమ యాత్రలో పాల్గొన్న సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అనిల్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కారుణ్య నియామకం కింద సౌజన్యకు విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ నెల 2న ఉత్తర్వులు జారీ చేశారు. కాగా చందుర్తి, కోనరావుపేటలో పోస్టులు ఖాళీగా ఉండగా, అంతదూరం వెళ్లలేనని మల్కాపూర్‌కు దగ్గరలో పోస్టింగ్ ఇప్పించాలని మంగళవారం ఆమె ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఆయన విద్యా శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఆమెకు దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని సూచించారు.
విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పించిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు రుణ పడి ఉంటానని సౌజన్య తెలిపింది. ఇందుకు సహకరించిన మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.