హైదరాబాద్, ఆగస్టు19 (నమస్తే తెలంగాణ): జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్)లో 4 వారాలగా నిర్వహిస్తున్న ‘సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ సర్టిఫికేషన్” ప్రోగ్రామ్ సోమవారంతో ముగిసింది. జేఎన్టీయూహెచ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్స్(డీఈఐఎస్), సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ సంయుక్తంగా హంట్ మెట్రిక్స్ ఇండియా సంస్థతో కలిసి “సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ సర్టిఫికేషన్” అంశంపై జూలై22 నుంచి సర్టిఫికెట్ ప్రోగ్రామ్ నిర్వహిసున్నది. తెలుగు రాష్ట్రాల నుంచి 46 మంది అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన ఆరుగురికి ఇంటర్న్షిప్ అవకాశాన్ని కల్పించారు. కార్యక్రమంలో హంట్ మెట్రిక్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు అయూబ్, భాసర్, జెఎన్టీయూ సీవోఈ ప్రొఫెసర్ శ్రీదేవి పాల్గొన్నారు.
జేఎన్టీయూహెచ్లో ఈ ఏడాది బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కోర్సులు ప్రారంభం కానున్నాయి. యూనివర్సిటీ ఫార్మసీ డిపార్ట్మెంట్ హెచ్వోడీ డాక్టర్ ఎస్ శోభారాణి ప్రకటనలో వెల్లడించారు. బీ ఫార్మసీలో 60సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఎం ఫార్మసీలో ఫార్మ సూటిక్స్, ఫార్మ సూటికల్ ఎనాలిసిస్, ఫార్మ సూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ విభాగాల్లో 15 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన అనంతరం ప్రఖ్యాత ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను యూనివర్సిటీ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కల్పిస్తామని వెల్లడించారు.