ఎదులాపురం, ఏప్రిల్ 13: ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాల్లో ఒకటైన జాతుర్ను బయట ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారుడు కుమ్ర లింగు కన్నుమూశారు.ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘటవ గ్రామానికి చెందిన కుమ్ర లింగు (72) మంగళవారం రాత్రి మృతిచెందారు. కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వాధ్యులతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రిమ్స్‌కు తరలించగా చికిత్సపొందుతూ చనిపోయారు.
బుధవారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. తెలంగాణలో జాతుర్ (12 మెట్ల కిన్నెర) వాయిద్యంలో సప్తస్వరాలు పలికించగల ఏకైక కళాకారుడు లింగు. ఆనపకాయ బుర్రలు.. లోహపుతీగలకు బదులుగా గుర్రపు వెంట్రుకలు.. 12 మెట్లలో తీగలు బిగించి వాయించే వాయిద్యంలో లింగు నైపుణ్యం పొందారు. కుమ్ర లింగు మృతిపై పలు ఆదివాసీ, గిరిజన సంఘం నాయకులు సంతాపం తెలిపారు.