టోక్యో: ‘తప్పు చేసినట్టు రుజువైతే తల నరుక్కుంటా’ అన్న మాటను రాజకీయ నేతల నోటంట అప్పుడప్పుడు వింటుంటాం. ఇప్పుడు ఇదే తరహాలో అవినీతికి పాల్పడితే ‘ఆత్మహత్య చేసుకుంటాం’ అని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయిస్తున్నది జపాన్‌లోని ఒక బ్యాంకు. పైగా ఆ ప్రతిజ్ఞను రక్తంతో సంతకం చేయించి మరీ తీసుకోవడం విశేషం. విధి నిర్వహణలో నగదును అపహరించమని, అవకతవకలు, ఆర్థిక అక్రమాలకు పాల్పడనని, ఒక వేళ అలా జరిగితే తమ సొంత ఆస్తుల నుంచి వాటిని తిరిగి చెల్లిస్తామని, తర్వాత ఆత్మహత్య చేసుకుంటామని రాసిన ప్రతిజ్ఞపై జపాన్‌లోని షికొకు బ్యాంకు యాజమాన్యం తమ సిబ్బందితో రక్తంతో సంతకం చేయించుకుంటున్నది. ఈ ప్రతిజ్ఞ స్క్రీన్ షాట్‌ను ఒక ఎక్స్ యూజర్ తన ఖాతాలో పెట్టారు.