హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బుధవారం రాష్ట్ర శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులను కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర్రావు ఎన్నిక చెల్లదని మంగళవారం హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జలగం అసెంబ్లీ కార్యదర్శిని కలిసి హైకోర్టు తీర్పు కాపీలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు ఇచ్చిన 84 పేజీల తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేసి అమలు చేయాలని కోరినట్టు చెప్పారు. త్వరలో స్పీకర్నూ కలుస్తానని తెలిపారు. ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి తీర్పు కాపీలు అందజేస్తానని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నానని తెలిపారు.