రవీంద్రభారతి,ఆగస్టు17: సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. కులగణన సాధనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని తెలిపారు.
హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందాల గణేశాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాజుల మాట్లాడారు. ఈ నెల 22న అఖిలపక్ష పార్టీల సమావేశం, 26 జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, సెప్టెంబర్ 6 లక్షలాది మంది బీసీలతో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధిస్తామని తెలిపారు.
కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ విస్మరించి బీసీ కులగణన ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ చెప్పిన కులగణన బూటకమని, ఆయన మాటకు ఆ పార్టీలో విలువేలేదని పేర్కొన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ప్రాణత్యాగానికి వెనుకాడబోమని జాజుల స్పష్టం చేశారు. బాల్‌రాజ్‌గౌడ్, వేముల వెంకటేశ్ పాల్గొన్నారు.