జగిత్యాల కలెక్టరేట్, మే 27 : పోలీసుల కండ్లుగప్పి కోర్టు ఆవరణ నుంచి ఓ రిమాండ్ ఖైదీ పారిపోయాడు. తెలిసిన సమాచారం మేరకు.. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం లింగాపూర్‌కు చెందిన జున్ను ప్రసాద్.. గల్ఫ్ పంపిస్తానని మోసం చేసిన కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇటీవల కొడిమ్యాల పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది.
అప్పటికే జగిత్యాల సబ్ జైలులో ఉన్న ప్రసాద్‌ను విచారణలో భాగంగా మంగళవారం కొడిమ్యాల పోలీసులు తీసుకెళ్లి కోర్టులో హాజరుపర్చారు. కేసును పరిశీలించిన జడ్జి ప్రసాద్‌ను తిరిగి రిమాండ్‌కు పంపాలని ఆదేశించారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన రిమాండ్ ఖైదీ తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టు నటించి, పోలీసుల కండ్లుగప్పి పారిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రసాద్ కోసం గాలిస్తున్నారు.