హైదరాబాద్: తెలంగాణ వాదులు భయపడుతున్నదే నిజం అవుతున్నదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఏపీకి దారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ఏ నీళ్ల కోసమైతే పోరాడారో ఆ నీళ్లను రేవంత్ రెడ్డి ఏపీకి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. మన నదులు మనకు కాకుండా చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ముందు ఢిల్లీకి వెళ్లేది లేదన్న రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్‌తో హుటాహుటిన పయణమయ్యాడని విమర్శించారు. హోటల్లో ఉండి రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్‌తో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ మీటింగ్‌కు సంబంధించి ఓ పత్రిక తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా హెడ్ లైన్ పెట్టిందన్నారు. జలవివాదాలపై కమిటీ అని తెలంగాణలో, గోదావరి-బనకచర్లపై కమిటీ అని ఏపీ ఎడిషన్‌లో పెట్టారని చెప్పారు. తెలంగాణకు చేస్తున్న ద్రోహమేమిటో తెలుసుకోవడానికి ఇదొక్కటి చాలన్నారు.
‘రేవంత్ తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నాడో, చంద్రబాబు ఏపీ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడా ఈ వార్తపై చర్చతో తేలిపోవాలి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై బూతులు కాదు.. కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై మాట్లాడాలి. తెలంగాణ సోయి, తెలంగాణ ఆత్మలేని వాళ్ల పాలన నడుస్తోందని తాము మొదట్నుంచి చెబుతున్నది నిజమైంది. సీఎం ఎవరికి భయ పడుతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడో?. ఒక్క ఫోన్ కాల్‌కు భయపడుతాడా? . తెలంగాణ ప్రజలు రేవంత్‌కు అధికారం ఇచ్చింది చీకటి ఒప్పందాలు చేసుకోవడానికా?. బనకచర్లపై ఇంత పచ్చి అబద్ధం మాట్లాడిన రేవంత్‌కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు డిమాండ్ చేయకుండా నిన్నటి మీటింగ్‌కు సీఎం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?. నీ ఒక్కడి పదవి కోసం కోట్లాది ప్రజల హక్కులను బలి పెడతావా?. ఎందుకు భయపడుతున్నావ్ రేవంత్ రెడ్డి, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడ్తున్నావా?. తన తప్పు కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి మళ్లీ కేటీఆర్‌కు నోటీసు ఇచ్చి డైవెర్షన్ రాజకీయాలకు తెర తీసే అవకాశముంది.
సీఎం చేసిన ద్రోహానికి తెలంగాణ వాదుల రక్తం మరిగిపోతోంది. వెనుకటి కాలంలో రాజులు ద్రోహులుగా ఉండే వారు. స్వతంత్ర పోరాటంలో కూడా ద్రోహం చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. మీడియా రూపాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. గోదావరి నదిని ఏపీకి తాకట్టు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. కాళేశ్వరం, మేడిగడ్డ దగ్గర పంపులు ఆన్ చేయకుండా గోదావరి జలాలను కిందకు వదిలే కుట్రను రేవంత్ ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నారు. చంద్రబాబుకు వంత పాడుతూ బీజేపీ నేతలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు.
బాధ్యత కలిగిన నాయకులు ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా వాడాలి. జ్ఞానం లేని వాళ్లే గోదావరిపై హక్కులు ఏపీకి కట్టబెట్టే విధానాన్ని సమర్ధిస్తూ మాట్లాడుతారు. చంద్రబాబు సహాయకులు రాసిచ్చిన స్క్రిప్టును రేవంత్ చదువుతున్నారు. రేవంత్ గురువులు మోదీ, చంద్రబాబు. వారు చెప్పినట్టు నడుచుకుంటున్నారు. ఏడాదిలో రాహుల్‌ను కలవలేదు కానీ, వారిద్దరిని రేవంత్ ఎన్నో సార్లు కలుస్తున్నారు. రాయలసీమకు నీళ్లిచ్చే ప్రణాళికను కేసీఆర్ చెప్పినట్టు ఇప్పటికీ అమలు చేయవచ్చు. రేవంత్ తీరు దొంగే దొంగ అని అరిచినట్టు ఉంది. రాహుల్ గాంధీకి మూటలు పంపినా మాకు అభ్యంతరం లేదు. కానీ నీళ్ల విషయంలో రేవంత్ తెలంగాణకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం’ అని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.