హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ధాన్యం, పత్తి ధరలు తగ్గడానికి రేవంత్ సర్కార్ కుట్రే కారణమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. పత్తి, వడ్ల కొనుగోళ్ల విషయంలో రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటున్నదని, సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ చేస్తున్నట్టుగా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రాలు ప్రారంభించి నెలరోజులైనా కొనుగోళ్లు చేయకుండా ప్లాన్ ప్రకారం రైతులను దళారీలకు, మిల్లర్లకు వదిలేశారని విమర్శించారు. దళారులు, మిల్లర్లతో మంత్రులు కుమ్మకు అయ్యారని, దీని వెనుక రూ.వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నల్లగొండ జిల్లా మంత్రి రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను బెదిరించారని, దళారులతో కుమ్మక్కై వందల కోట్లు వసూలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొన్నారు? ఇందులో సన్న వడ్లు ఎన్ని? దొడ్డు వడ్లు ఎన్ని? పత్తి ఎన్ని క్వింటాళ్లు కొన్నారు? బోనస్ ఎన్ని క్వింటాళ్లకు ఇచ్చారు? తదితర వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. వివరాలు చెప్పకుంటే అవినీతిని ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా భావిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశామని, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలుచేసిన విషయం రైతులను తెలుసని పేర్కొన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు ఎందుకు దోపిడీకి గురి అవుతున్నారో సీఎం, వ్యవసాయశాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సన్న వడ్లు ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనలేదని, సమాధానం చెప్పడానికి అధికారులు భయపడుతున్నారని నిలదీశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు.
కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి 25సార్లు ఢిల్లీ వెళ్లి ఎవరి కాళ్లు మొకారో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. ఉదయం రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ కాళ్లు, రాత్రి మోదీ, అమిత్‌షా కాళ్లు రేవంత్‌రెడ్డి పట్టుకుంటున్నారని ఆరోపించారు. బాజాప్తా కాంగ్రెస్, బీజేపీ బండారం బయటపెడతామని కేటీఆర్ చెప్పి మరీ ఢిల్లీకి వెళ్లారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కేటీఆర్ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారని, రేవంత్ అవినీతిపై బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. కేటీఆర్ ఎకడ ఉన్నారో.. ఎవరిని కలిశారో.. మీ ఇంటెలిజెన్స్ ఉంది కదా.. తెలుసుకోండని చురకలంటించారు. రాష్ట్ర మంత్రి ఇంటిపై జరిగిన ఈడీ రైడ్స్ వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్‌రెడ్డి వీపు పగలగొట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. రైతుబంధు, రుణమాఫీ, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవుగానీ, మహారాష్ట్ర పత్రికల్లో యాడ్స్‌కు ఖర్చుపెట్టడానికి రూ.300 కోట్లు ఎలా వచ్చాయని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలకు కూడా రూ.300 కోట్ల ప్రజాధనం ఖర్చుచేశారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైందని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ప్రజలు మర్చిపోయారు అంటున్న కేసీఆర్‌ను చూసి రేవంత్‌రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను వాడుకుని రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారని, ఆ పార్టీని మంచుతున్నారని సొంత పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారని చెప్పారు. చెడ్డ పేరు తెచ్చుకుని చరిత్రలో నిలిచిపోవాలని రేవంత్ భావిస్తున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో ఉన్న మేధావులు కొడంగల్‌కు వెళ్లిరావాలని, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి మేధావులు, ప్రొఫెసర్లు, పౌరహకుల నేతలను ప్రభుత్వం పంపించాలని సూచించారు.