Kothagudem | చర్ల, ఆగస్టు 7: పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని ఓ జడ్డీలో కూర్చోబెట్టుకొని జడివానలో దవాఖానకు తరలించిన ఘటన భద్రాద్రి జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. చర్ల మండలం బోదనెల్లి పంచాయతీ బూరుగుపాడుకు చెందిన ఆదివాసీ రవ్వ ఇడమ భార్య ఉంగి నిండు గర్భిణి. బుధవారం పురిటినొప్పులు రావడంతో ఓ జడ్డీని కట్టి అందులో ఆమెను కూర్చోబెట్టారు.
మూడు కిలోమీటర్లు ఆమెను జడ్డీపై మోస్తూ ప్రధాన రహదారి వరకు తీసుకొచ్చారు. అక్క డి నుంచి అంబులెన్సులో సత్యనారాయణపురం పీహెచ్సీకి తరలించారు. అక్కడ ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. కాగా, రవ్వ ఉంగికి ఇది మూడో కాన్పు. మొదటికాన్పులో బాబు, రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని, తాజాగా మూడో కాన్పులోనూ కవల ఆడపిల్లలు జన్మించినట్టు వారి బంధువులు తెలిపారు.