ఖైరతాబాద్, జనవరి 27 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గమని సర్పంచుల సంఘం జేఏసీ ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 5న సీఎం, మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించింది.
సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 మంది సర్పంచ్‌లు గ్రామాభివృద్ధే లక్ష్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానవాటికలు, క్రీడాప్రాంగణాలు, రైతు వేదికలు నిర్మించారని, వాటికి ఏడాదిగా బిల్లులు రాలేదని పేర్కొన్నారు.
బిల్లులు రాకపోవడంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకొని ఇప్పటికైనా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ముట్టడి కార్యక్రమానికి అన్ని గ్రామాల మాజీ సర్పంచ్‌లు హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు రాంపాక నాగయ్య, నర్సింహనాయక్, సహాయ కార్యదర్శి మేడబోయిన గణేశ్ ముదిరాజ్, పూర్ణచందర్‌గౌడ్, జూలకంటి మమతాబాలస్వామి తదితరులు పాల్గొన్నారు.