హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్లో కదలిక వచ్చింది. ఉద్యోగులంతా పోరుబాట పట్టడంతో జేఏసీ డిమాండ్లపై ఆరా తీసింది. ఈ మేరకు జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బెన్హర్ మహేశ్దత్ ఎక్కా మంగళవారం అన్నిశాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. మే 1లోగా జేఏసీ డిమాండ్లపై తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశించారు. తమ 57 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగుల జేఏసీ ఆందోళన బాటపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 17న నల్లబ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు తెలిపింది.
ఇక రెండో దశలో భాగంగా మే 5న కలెక్టర్ల ఎదుట నిరాహార దీక్షలకు జేఏసీ పిలుపునిచ్చింది. దీక్షలపై అప్రమత్తమైన సర్కార్, సంబంధిత అధికారులను వివరాలను కోరింది. ఇటీవలే ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో కాంగ్రెస్ సర్కార్కు ముచ్చెమటలు పట్టాయి. సమస్యలపై స్పందించకపోవడంతో కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. దీంతో సర్కార్ దిగి రావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దీ నిని గుణపాఠంగా తీసుకున్న ప్రభుత్వం..జేఏసీ తలపెట్టిన దీక్షలకు ముందే చర్చలు పిలిచే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.