హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతి జరిగిందని తాను చెప్పలేనని విద్యుత్తు జేఏసీ నేత రఘు స్పష్టంచేశారు. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని చెప్పారు. విద్యుత్తు కొనుగోళ్లుసహా భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌పవర్ ప్లాంట్ల నిర్మాణం వ్యవహారంలో విచారణ చేపట్టిన జస్ట్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ ఎదుట రఘు మంగళవారం హాజరయ్యారు.
ఆయనతోపాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా విచారణకు హాజరయ్యారు. కమిషన్ ఎదుట ప్రత్యక్ష విచారణకు హాజరుకావాలన్న సూచన మేరకు వారిద్దరు హాజరై తమ వివరణలు ఇచ్చారు. తాను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా డాక్యుమెంట్లను కమిషన్ ముందుంచినట్టు రఘు మీడియాకు వెల్లడించారు.
ముందుజాగ్రత్తలు పాటించలేదు: ప్రొఫెసర్ కోదండరాం
అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం అనేక నిబంధనలను ఉల్లంఘించిందని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా భద్రాద్రి, యాదాద్రిప్లాంట్లను ఏర్పాటు చేశారని విమర్శించారు. పోలవరం పూర్తయితే భద్రాద్రి ప్లాంట్ మునుగుతుందని హెచ్చరించారు.